Geetha Koumudi-1    Chapters   

తొమ్మిదవ కిరణము

కృష్ణునిబోధయొక్క స్వరూపము

(గీత -2వ అధ్యాయము)

అర్జునుడు తన విషాదములో వ్యక్తముచేసిన 8 భావములలో వైరాగ్య ముముక్షుత్వములను రెండు శాస్త్రీయ భావములను ఆధారము చేసుకొని అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియే అని మనము నిశ్చయించుకున్నాము. ఆలాగైతే అట్టి అర్జునునికి కృష్ణుడు చేసిన బోధ స్వరూపమేమి? అను విషయము విచారింప తగియున్నది. అర్జునుని విషాదమను పోగొట్టుటకుగాను కృష్ణునిబోధ అవసరమైనది కనుక విషాదమును రోగముయొక్క నిదానమును బట్టి బోధ అను చికిత్స యొక్క స్వరూపము తేలును. అర్జునుని విషాదమునకు హేతువులు రెండుగా గోచరించుచున్నవి.

1. ఆత్మకాని దేహమును ఆత్మ అని అనుకొని దేహము చనిపోతే ఆత్మయే చనిపోవునని అర్జునుడు దుఃఖించినాడు. కనుక యీ విషాదమునకు మొదటి హేతువు దేహాత్మభ్రాంతి. ఇది సర్వసాధారణ మోహము. ఇట్టి మోహము వల్లనే 'వీరందరు నా స్వజనమే' అను మమాధ్యాస, మమత్వము కలిగి వీరందరు చనిపోవుదురనే అని విషాదము కల్గినది. అర్జునుడు తన విషాదములో వ్యక్తం చేసిన 8 భావము లలో మొదటిదైన మమత్వము 7 వ దైన మూఢత్వము యీ మోహము యొక్క ఫలితములే. దానికి చికిత్స దేహము వేరు ఆత్మవేరు అను ఆత్మతత్వబోధయే. ఇదియే సాంఖ్యయోగ బోధ.

2. ఇంకను అర్జునునికి కలిగిన మిగతా 3, 4, 5, 6 భావములను, అనగా పాపభీతి. వర్ణసంకరత్వము, స్వధర్మత్యాగపూర్వక పరధర్మ వాంఛ, జయసందేహము అను నాల్గింటిని విమర్శించి పరిశీలించినచో వీనికి హేతువు స్వధర్మానుష్ఠానముయొక్క స్వరూపము మహాత్మ్యము తెలియక పోవుట అని తేలును. ఇది అర్జునునికి కలిగిన, విశేషమోహము. ఈ విశేషమోహమువల్ల స్వధర్మమైన యుద్ధము అధర్మమని, పరధర్మమైన భిక్షాటనము ఉత్తమధర్మమని, అర్జునుడు భావించినాడు. ఇంకను వీరి అందరిని చంపితే పాపము వస్తుంది అని వర్ణసంకరమవుతుందని విలపించినాడు. మరియు యుద్ధములో మనమే గెలుస్తామో, కౌరవులే గెలుస్తారో అను జయసందేహమును కూడా వ్యక్తము చేసినాడు ఇది అర్జునుని విషాదమునకు 2వ హేతువు. దీనికి చికిత్స ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా స్వధర్మానుష్ఠానమును చేయవలెను అను బోధ. ఇదియే నిష్కామకర్మయోగబోధ.

మొదటిదైన ఆత్మతత్త్వబోధవల్ల ప్రతిజీవుని శరీరములోను ఉన్న ఆత్మ నిత్యమైనది, ఏకమైనది, నిర్వికారమైనది, నిష్కామమైనది, సర్వవ్యాపకమైనది, నిరవయవమైనది, సచ్చిదానంద అనంత స్వరూపమైనది అని తేలుట వల్ల ఆత్మ చచ్చిపోతుంది అను అజ్ఞానము నశించి, దానివల్ల కలిగిన విషాదము పోవును. రెండవదియైన ఫలాపేక్ష లేని స్వధర్మానుష్ఠానబోధయను నిష్కామకర్మయోగ బోధ వల్ల అర్జునుడు తనకు స్వధర్మమైన యుద్ధమును ఫలాపేక్ష లేకుండా చేయవలెను అని తేలును కనుక యుద్ధమువల్ల వారందరిని చంపిన పాపఫలము వర్ణసంకరత్వఫలము కల్గును అను భావములు మనమే గెలుస్తామో కౌరవులే గెలుస్తారో అను జయసందేహము పరధర్మమైన భిక్షాటనమందు వాంఛ, యివి అన్నియు పోయి దీనివల్ల కలిగిన విషాదము పోవును. ఇట్లు అర్జునునికి విషాదమును కలిగించిన రెండు కారణములు ఆ రెండురకములు అయిన బోధలవల్ల నశించగా, అర్జునుని విషాదము పోయి అర్జునుడు ధైర్యోత్సాహములతో తన స్వధర్మమైన యుద్ధము చేయుటకు అవకాశము కల్గును. కనుక కృష్ణుని బోధయొక్క స్వరూపము ద్వివిధము.

1. ఆత్మతత్త్వబోధ లేక జ్ఞాన యాగబోధ.

2. నిష్కామకర్మబోధ లేక కర్మయోగబోధ; అనగా జ్ఞాన నిష్ఠ, కర్మనిష్ఠ అను నిష్ఠాద్వయముతో కూడిన బోధ. ఈ విషయమునే కృష్ణపరమాత్మ భగవద్గీత 3వ అధ్యాయములోని 3వ శ్లోకములో

'లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠాపురాప్రోక్తా మయా నఘ |

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేనయోగినాం||'

అని స్పష్టము చేసినాడు. నిష్ఠాద్వయముతో కూడిన బోధ అనుటవల్ల జ్ఞానబోధ, కర్మబోధ అనునవి రెండును పరస్పర సంబంధములేని ప్రత్యేక బోధలు కావనిన్ని, రెండు నిష్ఠలతో కూడినబోధ ఒకటే అనిన్ని తేలుటవల్ల కర్మయోగము, జ్ఞానయోగమునకు సాధనమనిన్ని, జ్ఞానయోగము కర్మయోగమువల్ల సాధ్యమనిన్ని ఆ రెంటికి సాధ్యసాధన సంబంధము ఉన్నదనిన్ని స్పష్టమగుచున్నది. 'యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాధి మాంత్వాం ప్రసన్నం' అని అర్జునుడు 2వ అధ్యాయం 7 వ శ్లోకము చివరి భాగములో కృష్ణుని అర్థించినది శ్రేయస్సు, శ్రేయస్సు అనగా కఠోపనిషత్తులో విశదీకరింపబడిన ప్రకారము పరమ పురుషార్థమైన మోక్షమే, అట్టి మోక్షము 'తరతి శోకమాత్మవిత్‌' అను ఉపనిషత్‌ ప్రమాణమును బట్టి ఆత్మ జ్ఞానమువల్లనే కల్గును. అట్టి ఆత్మజ్ఞానము అంతఃకరణము సంస్కృతమై పరిశుద్ధమైతేనే కలుగును. అట్టి అంతఃకరణశుద్ధి కర్మయోగమువల్లనే కల్గును. కనుక కర్మయోగము సాధనము'జ్ఞానయోగము సాధ్యము, జ్ఞానమువల్ల మోక్షము 'జ్ఞానాదేవహి కైవల్యం' అనిగదా ప్రమాణము.

ఇట్టి ఆత్మజ్ఞానబోధను కృష్ణపరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయములో 'సాంఖ్యయోగము' అను పేరుతో విశదీకరించినాడు 'సాంఖ్యయోగము' అనగా 'సమ్యక్‌ ఖాయతే అనేక ఆత్మతత్త్వం ఇతి సాంఖ్యం' అను నిర్వచన ప్రకారం దేనిలో ఆత్మతత్త్వము బాగుగా నిరూపించబడినదో అది సాంఖ్యయోగము అని స్పష్టమగుచున్నది. కనుక అర్జునుని విషాదమును పోగొట్టుటకు కృష్ణపరమాత్మ ఆత్మతత్త్వజ్ఞానబోధను సాంఖ్యయోగము అను పేరుతో గీతలో 2వ అధ్యాయములో విశదీకరించి, అందుకు సాధనమైన కర్మయోగ బోధను 3వ అధ్యాయములో కర్మయోగము అను పేరుతో విశదీకరించినాడు. కనుక కృష్ణుని బోధ అంతయు గీతలోని 2, 3 అధ్యాయములలోనే నిరూపించబడినది. మిగతా అధ్యాయములన్నియు ఈ 2, 3 అధ్యాయములలోని బోధయొక్క వివరణ రూపములే అని తెలిసికొనవలసి యున్నది.

ఇంకను బాగా విమర్శించినచో, నిష్ఠాద్వయరూప బోధ అంతయు ఒక్క రెండవ అధ్యాయములోనే విసదీకరింపబడినదని తేలును. 2 వ అధ్యాయములో 11వ శ్లోకము మొదలు 36 వ శ్లోకమువరకు ఆత్మతత్త్వభోధము, అట్టి ఆత్మ జ్ఞానులయొక్క లక్షణములు 54 మొదలు 72 వరకును విశదీకరింపబడి అట్టి ఆత్మజ్ఞానమునకు సాధనమగు కర్మయోగబోధ 39 మొదలు 53 వరకుగల శ్లోకములలో స్పష్టీకరింపబడినది. దానియొక్క వ్యాఖ్యానరూపమే 3 వ అధ్యాయము. అందుకనే కృష్ణపరమాత్మ 3 వ అధ్యాయం 3వ శ్లోకంలో 'లోకేస్మిన్‌ ద్వివిధానిష్ఠా పురాప్రోక్తా" అని చెప్పినాడు. అందుచేత ఈ నిష్ఠాద్వయరూపమైన బోధ అనగా జ్ఞానయోగము, కర్మయోగము అనుబోధ పురాప్రోక్తా' లోగడనే చెప్పబడినది. అనగా రెండవ అధ్యాయములోనే చెప్పబడినది అని కృష్ణుడు స్పష్టీకరించినాడు. కనుక భగవద్గీత అంతకు సారము 2 వ అధ్యాయము. దీనికి మిగతా అధ్యాయములు వ్యాఖానరూపములు. ఇదియే కృష్ణుని బోధయొక్క స్వరూపము.

___

Geetha Koumudi-1    Chapters